రైతుల వద్ద నుండి వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో కొనుగోలు కేంద్రాల నుండి వడ్లు తరలింపులో రైస్‌మిల్లర్లు అలసత్వం లేకుండా తమ పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్ద శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి రైస్‌మిల్లర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ జిల్లాలో వరిధాన్యం అధిక దిగుబడి రాగా 1 లక్షా 54 వేల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నామని, వర్షాభావ పరిస్థితుల దృష్ట్వా రైతు కల్లాలలో వరిధాన్యం నిల్వ ఉండకుండా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తరలించి అక్కడి నుండి ఎలాంటి జాప్యం లేకుండా లారీల ద్వారా వరిధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నందున వరిధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, జిల్లాలో ఏ ఒక్కరైతు కూడా నష్టపోకూడదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల మాదిరిగా మంచిర్యాల జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రైస్‌మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో చర్చించి, మిల్లర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. రైస్‌మిల్లులలో వరిధాన్యం అన్‌లోడింగ్‌లో హమాలీల కొరత లేకుండా చూస్తామని, ఇతరత్రా ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ గోదాములలో వరిధాన్యం నిల్వ చేసేందుకు గాను ప్రభుత్వం తరుపున సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి కోత లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని తీసుకోవాలని, కల్లాలలో ధాన్యం బస్తాలు నిల్వ ఉండకుండా సహకరించాల్సిన బాధ్యత మిల్లర్లదే అని తెలిపారు. కల్లాలల్లోనే ధాన్యంలో తప్ప, తాలు లేకుండా గోనె సంచులలో నింపాలని, నిబంధనల మేరకు తేమ శాతం పరిశీలించి, సరైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు అనుమతించడంతో పాటు రైతులు, ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో నమోదు చేయాలని తెలిపారు. రైతులు ఇబ్బంది పడకుండా వేసవికాలం అయినందున తాగునీరు, నీడ, మౌళిక వసతులు కల్పించాలని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ధాన్యంను లక్ష్యాలకు మించి కొనుగోలు చేయడంతో పాటు ఇతర జిల్లాలకు తరలించడం జరిగిందని, రైతులు ఇబ్బంది పడకుండా పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మిల్లర్లు సరైన సమయంలో అన్‌లోడింగ్ చేసి వర్షాభావ పరిస్థితుల్లో రైతు నష్టపోకుండా చూడాలని కోరారు. మిల్లర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు సంయుక్తగా ధాన్యం తరలింపు అంశంలో సానుకూలంగా అంగీకరించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కిష్టయ్య, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్కుమార్, జిల్లా మేనేజర్ గోపాల్, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ లింగయ్య, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నల్మాసు కాంతయ్య, రైస్‌మిల్లర్లు లారీ అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.