విద్యుత్ పొదుపు, ఆదాపై ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్‌లో ఎన్.టి.పి.సి. ఆధ్వర్యంలో నిర్వహించిన ఉజ్వల భారత్ – ఉజ్వల భవిష్య విద్యుత్ మహోత్సవాలలో మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, ఎన్.టి.పి.సి. రామగుండం జి.ఎం. ప్రసేంజిత్ పాల్‌లతో కలిసి హాజరాయ్యరు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అవసరమైనంత మేరకు మాత్రమే విద్యుత్‌ను వినియోగించాలని, భావి తరాలకు సహజమైన, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన శక్తిని అందించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని తెలిపారు. రాజ్యాంగంలో హక్కులతో పాటు బాధ్యతలను కూడా అందించిందని, హక్కులను సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతను నిర్వర్తించాలని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో అందరు పాలు పంచుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు, ప్రజలకు నిరంతర విద్యుత్ అందించడం జరుగుతుందని, ప్రధాన మంత్రి కిసాన్ ఉజ్ఞా సురక్ష కుసుం-11 వంటి పథకాల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, సౌరశక్తిని విద్యుదీకరించడం అధునాతన ఆవిష్కరణలో భాగమని, దీన్‌దయాల్ ఉపాధ్యాయ, గ్రామ జ్యోతి యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కొరకు ఆధునీకతను అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. పగటి వేళలలో విద్యుత్‌ను ఆదా చేయడం ద్వారా సహజ సంపదను పెంపొందించవచ్చని తెలిపారు. మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట సాగు కొరకు నిరంతర విద్యుత్ అందించడంతో పాటు అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్.టి.పి.సి. జి.ఎం. మాట్లాడుతూ అంతర్గత విద్యుత్‌శక్తి అభివృద్ధి వ్యవస్థ ద్వారా పట్టణాలలో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని, ట్రాన్స్ఫార్మర్ లైన్లు, సబ్ స్టేషన్లకు మెరుగైన వసతులు సమకూర్చబడుచున్నాయని, సౌభాగ్య పథకం ద్వారా దేశంలోని ప్రతి ఇంటిలో వెలుగు నింపే విధంగా ఉచిత మీటర్ కనెక్షన్ ద్వారా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు విద్యుత్ చౌర్యంకు పాల్పడకుండా పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్.టి పి.సి. ఇంజనీర్లు వంశీకృష్ణ, ఆదిత్య, చిరంజీవి, మంచిర్యాల మున్సిపల్ చైర్పర్సన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.