MNCL : శాంతి, అహింసతో స్వేచ్చా, స్వాతంత్రాలను అందించిన మహనీయుడు మన జాతిపిత : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

శాంతి, అహింస మార్గంలో పోరాడి భారతదేశానికి స్వేచ్చా, స్వాతంత్రాలను అందించిన మహనీయుడు మన జాతిపిత మహాత్మాగాంధీ అని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి, గాంధీ పార్కులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్రిటీష్‌ దేశాన్ని శాసిస్తున్న రోజుల్లో సత్యం, అహింస, స్వరాజ్‌, స్వదేశీ అంశాలతో, సుసంపన్నమైన భారతదేశ సంపదను దోచుకుంటున్న బ్రిటీష్‌ వారితో పోరాడుతూనే స్వదేశంలో ఉన్న సమస్యలైన అంటరానితనం, మహిళా హక్కులు, వరకట్నం తదిత సామాజిక అంశాలపై కూడా శాంతి మార్గంలో పోరాటం చేసిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని తెలిపారు. ఏదైనా సాధించాలంటే సాధించడం మాత్రమే ముఖ్యం కాదని, మనం ఎంచుకున్న మార్గం కూడా ముఖ్యమేనని, దేశానికి స్వాతంత్రం సాధించడమనే లక్ష్యంతో పాటు విలువలు, సిద్దాంతాలు కూడా ముఖ్యమని ఆచరణలో చూపారని, మహనీయుల జీవితాల నుండి మనం ఎంతో నేర్చుకోవాలని తెలిపారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో గొప్ప స్థాయిలో ఉన్న వారు సైతం మహాత్మా గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆచరిస్తున్నారని చెప్పడానికి గర్విస్తున్నానని తెలిపారు. దేశంలో ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం, స్వేచ్చ, కుల, మత, వర్ద, వర్ణ విబేధాలకు అతీతంగా సమానత్వం, సౌభ్రాతృత్వం ఆనాటి మహనీయుల పోరాటాల ఫలితమేనని అన్నారు. మహాత్మాగాంధీ సౌత్‌ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఒక సామాన్యుడేనని, సూర్యుడు అస్తమించని రాజ్యంగా అభివర్ణించిన బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని ఒక సామాన్యుడు చేయాలనుకుంటే ఎదురించి, దేశం నుండి వెళ్ళగొట్టగలడు అని మన జాతిపిత నిరూపించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వివిధ వార్డుల కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post