సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన ఆశయాలను ఆదర్శనీయమని, ప్రతి ఒక్కరు తమ నిత్య జీవితంలో ఆచరించదగిన అంశాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నుండి ఎఫ్.సి.ఎ. కమ్యూనిటీ హాల్ వరకు సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఎఫ్.సి.ఎ. కమ్యూనిటీ వాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి.మధుసూదన్ నాయక్, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యతో హాజరై సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ చూపిన మార్గం ఆదర్శనీయమని అన్నారు. 1739లో జన్మించిన సేవాలాల్ ఆచరించి మార్గాన్ని ప్రతి ఒక్కరు తమ నిత్య జీవితంలో అమలు చేసినప్పుడు ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినవారమవుతామని తెలిపారు. ఉన్నత అంశాలను ఆదర్శంగా తీసుకొని, ఆచరించి జీవించిన గొప్ప వ్యక్తి ‘సేవలాల్ అని అన్నారు. దాదాపు రెండు వందల సంవత్సరాలు దాటినా సేవాలాల్ మహారాజ్‌ను స్మరించుకుంటున్నామని, ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంతో గొప్పదని, అహింసా మార్గాన్ని అవలంభించాలని, మహిళలను గౌరవించాలని సేవాలాల్ చేసిన బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్ గాజుల ముఖేష్‌గౌడ్, సేవాలాల్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.