జిల్లాను అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, బి.రాహుల్ ట్రైనీ కలెక్టర్ పి.గౌతమితో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, రెవెన్యూ అధికారులతో అభివృద్ధి పనులనుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో చేపట్టి పురోగతిలో ఉన్న పనులను 100 శాతం పూర్తి చేసే విధంగా దృష్టి సారించాలని, కష్టపడి పనిచేసి లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. విధుల పట్ల పూర్తి నిబద్దతతో వ్యవహరించాలని, నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుకు అధికార యంత్రాంగం సమన్వయంతో అందరి సహకారంతో పని చేయాలని, నిర్ధేశిత లక్ష్యాల సాధనలో తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీల ద్వారా రుణ సదుపాయం కల్పించి ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహించాలని, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద చేపట్టిన పనులను పూర్తి చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం మొదటి విడతలో జిల్లాలో ఎంపికైన 248 పాఠశాలలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ౩6 పాఠశాలలను ప్రారంభానికి సిద్దం చేయడం జరుగుతుందని, 22 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, అన్ని పనులు పూర్తి చేసిన పాఠశాలలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ప్రజల కంటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 27 గ్రామీణ ప్రాంతాలలో, 13 పట్టణ ప్రాంతాలలో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి 18 సం॥ల వయస్సు నిండిన వారందరికీ పరీక్షలు నిర్వహించి మందులు, అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలందరు వినియోగించుకునే విధంగా విసృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో యాసంగిలో 79 వేల 800 ఎకరాలలో సాగుతో పాటు వానాకాలంలో ‘సైతం వరిసాగు చేయడం జరుగుతుందని, అర్హులైన రైతులందరికీ రైతుబంధు వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల శ్రేయస్సు దృష్టా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యం కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు అనంతరం అక్కడి నుండి భారత ఆహార సంస్థకు తరలించడం జరుగుతుందని తెలిపారు. పశు సంవర్థక శాఖ ద్వారా జిల్లాలో పశువులలో కృత్రిమ గర్భధారణ పద్దతి ద్వారా పాడి రైతుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, ఇదే క్రమంలో పశువుల సంక్షేమం కోసం టీకాలు, మందుల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ౩11 గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య కార్యక్రమం ద్వారా గ్రామాలలోని అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, నివాస ప్రాంతాలను పరిశుభంగా ఉంచడంతో పాటు ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా అభివృద్ధి కొరకు కార్యచరణ రూపొందించుకొని ప్రణాళికబద్దంగా అమలు చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, అభివృద్ధి పనులను ప్రాధాన్యతను బట్టి పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి పనులలో ఆయా శాఖలకు కేటాయించిన నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ శాఖలకు కేటాయించిన పనుల వివరాలు, పురోగతిపై పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.