MNCL : సమీకృత కలెక్టరేట్ల ద్వారా ప్రజలకు ఒకే చోట ప్రభుత్వ సేవలు లభ్యం : ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్‌

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ల ద్వారా ప్రజలకు ఒకే చోట ప్రభుత్వ సేవలు అందించడం జరుగుతుందని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్‌ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్‌లో నిర్మితమవుతున్న సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌ నేత, జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.రాహుల్‌, ట్రైనీ కలెక్టర్‌ పి.గౌతమి, శాసన మండలి సభ్యులు విఠల్‌, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి మార్చి 15వ తేదీ లోపు ప్రారంభానికి సిద్దం చేయాలని తెలిపారు. గ్రాండ్‌ ఫ్లోర్‌లో సుమారు 53 వేల 428 చదరపు అడుగుల స్థలంలో భవన నిర్మాణం జరుగుతుందని, మొదటి అంతస్తులో సుమారు 50 వేల చదరపు అడుగుల నిర్మాణం జరుగుతుందని, మిగిలిన ఉన్న విద్యుత్‌, ఫర్నీచర్‌, పైప్‌లైన్‌ ఇతరత్రా పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుత్తేదారులు నిర్మాణ పనులలో అవసరమైతే కూలీల సంఖ్యను పెంచి నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికార వికేంద్రీకరణ చేస్తూ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించేందుకు సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుడుగు వేసిందని, దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. జిల్లాలో చేపట్టిన సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో గోదావరి నది మీదుగా అంతర్జాం వరకు వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుందని, టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, చెన్నూర్‌ నియోజకవర్గ పరిధిలోని దాదాపు 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చెన్నూర్‌ ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టులతో రైతులకు సాగునీటికి కొరత లేకుండా పంట సాగు చేసుకుంటున్నారని, జిల్లాలో మారుమూల గ్రామాలను కలుపుతూ వంతెనలు, రహదారుల నిర్మాణంతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు అయిన తరువాత అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. దేశంలో తలసరి ఆదాయంలో ప్రథమ స్థానం, పంటల దిగుబడిలో ద్వితీయ స్థానం, విద్యుత్‌ వినియోగంలో మొదటి స్థానాలలో, ఐ.టి. ఎగుమతులలో మొదటి స్థానాలలో ఉన్నామని, జాతీయ స్థాయిలో గ్రామాలకు అందించిన 20 అవార్డులలో 19 అవార్డులు రాష్ర్రానికి రావడం గర్వంగా ఉందని తెలిపారు. అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ దేశంలో ముందంజలో ఉండేలా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు కార్మికులంతా కలిసి సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థల లాభాలలో 30 శాతం వాటా కార్మికులకు అందించడం జరిగిందని, కారుణ్య నియామకాలను పున:రుద్దరించి 15 వేల మందికి పైగా సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల స్థాయి నుండి అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో అధికార యంత్రాంగం పనితీరు అభనందనీయమని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన వారికి అందించడంలో
విశేష కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రోడ్లు-భవనాల శాఖ అధికారులు, గుత్తేదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post