MNCL : సమీకృత కలెక్టరేట్‌ భవన పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల (కలెక్టరేట్‌) సముదాయం భవనం పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్‌ మండల కేంద్రంలో నిర్మితమవుతున్న సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణ పనులను జిల్లా అదనపు కలెక్టర్లు డి. మధుసూదన్‌ నాయక్‌, బి.రాహుల్‌, డి.సి.పి. సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి పరిశీలించారు. కలెక్టరేట్‌ భవనంలో జిల్లా శాఖల కార్యాలయాలు, వివిధ సేవల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు వేచి ఉందే ప్రాంతాలు, భవన ఆవరణ, సమావేశ మందిరం పనులను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన సమీకృత కలెక్టరేట్‌ భవనాల నిర్మాణాలలో భాగంగా జిల్లాలో చేపట్టిన కలెక్టరేట్‌ పనులను వేగవంతం చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని, అంతర్గత రహదారులు, గ్రీన్‌ కారిడార్‌, మురుగు కాలువల వ్యవస్థ, త్రాగునీరు, విద్యుత్‌ సరఫరా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల సముదాయం ద్వారా జిల్లా శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా అందుతాయని, కార్యాలయాలకు తిరిగే అవస్థలు తొలగుతాయని తెలిపారు. సంబంధిత అధికారులు ప్రతి రోజు పనులను పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్దం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల రాజస్వ మండల అధికారి దాసరి వేణు, ఎ.సి.పి. తిరుపతిరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, నస్సూర్‌ తహళశిల్దార్‌ జ్యోతి, నస్పూర్‌ మున్సిపల్‌ కమీషనర్‌ రమేష్స్‌ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post