MNCL : సి.పి.ఆర్‌. విధానం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు : జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తిని సి.పి.ఆర్‌. విధానం ప్రాణాలు కాపాడవచ్చని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల వైద్య కళాశాలలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సి.పి.ఆర్‌.-ఎ.ఈ.డి.పై ఆరోగ్య కార్యకర్తలకు, వైద్య కళాశాల విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని టైనీ కలెక్టర్‌ పి.గౌతమి, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా! బి.సి. సుబ్బారాయుడుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గుండెపోటుతో సంభవించే మరణాలను సి.పి.ఆర్‌. విధానం ద్వారా దాదాపు 50 శాతం వరకు నియంత్రించవచ్చని తెలిపారు. ఎవరైనా గుండెపోటుకు గురై హఠాత్తుగా పడిపోయినట్లయితే ఆ ప్రదేశం సి.పి.ఆర్‌. విధానానికి అనువుగా చూసుకొని బాధిత వ్యక్తి ఛాతిపై రెండు చేతులను నొక్కిపట్టి ఉంచి నిమిషానికి 100 సార్ల చొప్పున 30 సార్లు ఒత్తిడి కలిగిస్తూ తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, ఈ విధానం ద్వారా ఆగిపోయిన గుండెకు ప్రాణం పోయవచ్చని తెలిపారు. ఆరోగ్య, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌.టి.సి. అధికారులు,
సిబ్బంది, స్వచ్చంద సంస్థలు, సంక్షేమ సంఘాల సభ్యులు సి.పి.ఆర్‌. చేయడం తెలిసి ఉంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని, గుండె నొప్పికి గురైన బాధితుడికి సత్వర చికిత్స అందించి ఆసుపత్రికి చేరే లోపు ప్రమాదం నుండి తప్పించవచ్చని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం సి.పి.ఆర్‌. శిక్షణ అందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సులేమాన్‌, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post