MNCL : 18 సం॥లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి : రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

18 సం॥లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా అధికార యంత్రాంగం విసృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఓటరు జాబితా రూపకల్పన, గరుడ యాప్‌ వినియోగంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సం॥లు నిండి ప్రతి ఒక్కరి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలని, ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ఆవశ్యకత, ప్రాధాన్యతను వివరించి అర్హత గల ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకోవడం జరిగేదని, ఈ సంవత్సరం నుంచి జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకుంటూ 18 సంలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటు హక్కు నమోదు, ఓటరు జాబితా తయారుపై అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని, జాబితాలో ఉన్న పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని తెలిపారు. జాబితాపై ఆగస్టు 4 నుంచి అక్టోబర్‌ 24వ తేదీ వరకు ప్రీ రివిజన్‌ నిర్వహించి నవంబర్‌ 9వ తేదీన ముసాయదా ఓటరు జాబితా విడుదల చేయాలని, డిసెంబర్‌ 8వ తేదీ వరకు సదరు జాబితాపై అభ్యంతరాలను స్వీకరించాలని తెలిపారు. రెండు శనివారాలు, రెండు ఆదివారాలు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి డిసెంబర్‌ 26వ తేదీ లోగా అభ్యంతరాలను, ఓటర్‌ క్లెయిమ్స్‌ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5, 2023న తుది ఓటరు జాబితా రూపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటరునమోదుకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని, ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, స్వీప్‌ కార్యక్రమాల నిర్వహణ పట్ల జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. నూతన ఓటు హక్కు నమోదు, పేరు, చిరునామా మార్పులు, చేర్పులు, తొలగింపుల కొరకు ఎన్నికల కమీషన్‌ నిర్ధేశించిన ఫారం-6, ఫారం-7, ఫారం-6వి, ఫారం-8 ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎన్నికల కమీషన్‌ ఫారం-8ఏ రద్దు చేసిందని, ఫారం-6లో నూతన ఓటరు నమోదు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఫారం-6బి ద్వారా ఓటరు గుర్తింపు కార్డు కలిగి ఉన్న వారు తమ ఆధార్‌ వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఆన్‌లైన్‌లో ఈ.ఆర్‌.ఓ. నెట్‌, గరుడ, ఎన్‌.వి.ఎస్‌.పి., వి.హెైచ్‌.ఎ.లతో పాటు ఎన్‌.వి.ఎస్‌.పి., వి.హెైచ్‌.ఎ. యాప్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారి వద్ద నూతన ఫారంలు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆగస్టు 1వ తేదీ నుండి ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వద్ద నుంచి ఆధార్‌ వివరాలు సేకరించాలని, ఆధార్‌ వివరాలు అందించడం ఐచ్చికం మాత్రమేనని, ఓటర్ల ఆధార్‌ వివరాలు లీక్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్‌ ప్రాజెక్టు అధికారి వరుణ్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, ఎన్నికల డి.టి. శ్రీనివాస్‌ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post