గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి 4 విడతలుగా విజయవంతం చేసిన పల్లెప్రగతిలో భాగంగా నెల 18వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లాలోని బెల్లంపల్లి మండలం లింగాపూర్‌లో నిర్వహిస్తున్న పల్లెప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లెప్రకృతి వనంలో మొక్కలకు సమయానికి నీటిని అందిస్తూ సంరక్షించాలని, వైకుంఠధామంలో నీరు, విద్యుత్ సరఫరా సౌకర్యాలు కల్పించి పూర్తి స్థాయిలో వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగార 2022-23 సంవత్సర లక్ష్యాలకు అనుగుణంగా నర్సరీలలో మొక్కలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రతి రోజు ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడంతో పాటు వాటిని ఆదాయ వనరుగా మార్చడంలో ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గ్రామంలో కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్వహణ ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలు జరుగుతున్న పల్లెప్రగతి కార్యక్రమ పనులపై పలు సూచనలు, సలహాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దుర్గప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్, మండల
పంచాయతీ అధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, సర్పంచ్ వెంకటేష్, ఎం.పి.టి.సి., వార్డు సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.