RAJ BHAVAN – Press Communique on 13.05.2021.

                                                                           పత్రికా ప్రకటన

రాజ్ భవన్,

హైదరాబాద్

తేది. 13.05.2021

 

మరిన్ని ఐసోలేషన్ సెంటర్ లు అవసరం:  గవర్నర్

కాలనీలు, అపార్ట్ మెంట్  లలో తమ  తమ స్వంత ఐసోలేషన్ సెంటర్ లు ఏర్పాటు చేసుకుని అక్కడ కోవిడ్ తో బాధపడుతున్న వారికి ఐసోలేషన్ సౌకర్యం కల్పించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్  పిలుపునిచ్చారు.

కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్లు తక్కువ స్థాయి లక్షణాలున్నవారికి, లేదా లక్షణాలు లేకుండా కోవిడ్ పాజిటివ్ వచ్చినవారికి ఐసోలేషన్ సౌకర్యం తమ అందుబాటులోనే కల్పిస్తాయని గవర్నర్ వివరించారు.

 రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్ లో ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ సెంటర్ ను గవర్నర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కోవిడ్ పేషంట్ ల తో వైద్య వ్యవస్థ, వైద్యులు ఇతర మెడికల్ సిబ్బంది ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నారు.

కోవిడ్ తో తీవ్రంగా బాధ పడుతున్న రోగులకి హాస్పిటల్ సౌకర్యము అందాలంటే, స్వల్ప లక్షణాలతో ఉన్న వారికి తమ తమ చిన్న ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స అందించాల్సిన అవసరం ఉందని డాక్టర్ తమిళిసై వివరించారు.

కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్లు మైక్రో కంటెన్మెంట్  జోన్లుగా కూడా పనిచేస్తాయని గవర్నర్ అన్నారు.

వైద్య వ్యవస్థను మరింత ఒత్తిడి నుండి కాపాడాలంటే ప్రజలంతా సరైన కోవిడ్ నివారణ నిబంధనలను పాటించాలని డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు.

ప్రజల స్వీయ  జాగ్రత్తలను పాటించడం కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో ఇప్పుడు అత్యంత కీలకాంశం అని  గవర్నర్ అన్నారు.

ఈ సమావేశంలో మాట్లాడిన గవర్నర్ భర్త, ప్రముఖ నెఫ్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ పి. సౌందరరాజన్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కోవిడ్ బారిన పడకుండా తనను తాను రక్షించుకోవడానికి సరైన నివారణ పద్ధతులు గట్టిగా పాటించాలని సూచించారు. దీనివల్ల వైద్య వ్యవస్థ పై భారం తగ్గుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పోలీసు శాఖ, సిబ్బంది కోవిడ్ నియంత్రణ చర్యలలో, రోగులకు సహాయ సహకారాలు అందించడంలో నిరంతరం కృషి చేస్తున్నారని గవర్నర్ కు వివరించారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ప్రతినిధి విశాల్ ఆర్య, గవర్నర్ సలహాదారులు ఏపీ వి ఎన్ శర్మ, మొహంతి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

ఈ కార్యక్రమాన్ని గవర్నర్ సెక్రెటరీ కె సురేంద్రమోహన్ సమన్వయం చేశారు.

జాయింట్ సెక్రటరీ లు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రెస్ సెక్రటరీ

Share This Post