Press note. 01.02.2023. ప్రయివేటు కార్పోరేట్ పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు.

బుధవారం నాడు ఆయన ఎం.ఎల్.సి. ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ లతో కలిసి మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా తయారైన భువనగిరి పట్టణం గాంధీనగర్ ప్రాథమికోన్నత పాఠశాల-2 ను ప్రారంభోత్సవం చేశారు. పాఠశాలలోని డిజిటల్ క్లాసు, రీడింగ్ కార్నర్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడే ప్రతి ఒక్క కార్యాన్ని సాధిస్తున్నారని, అందులో భాగమే మన ఊరు మనబడి కార్యక్రమమని అన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే లక్ష్యంతో మౌళిక సదుపాయాలు కల్పిస్తూ వంద శాతం నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో కంటే ప్రభుత్వాసుపత్రులలో నాణ్యమైన వైద్య సేవలు మెరుగుపరిచినందున ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తున్న విధంగానే విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అన్నారు.

ఎం.ఎల్.సి. ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగంపై ప్రత్యేక దృష్టితో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక పేద విద్యార్థుల కోసం సకల సౌకర్యాలతో పెద్ద ఎత్తున మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టారని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని 26 వేలకు పైగా ఉన్న పాఠశాలలకు 7 వేల 300 కోట్ల నిధులు విద్యారంగానికి కేటాయించారని, విద్య ద్వారానే ఉన్నతి అని, విద్య ద్వారానే ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగంపై పెట్టుకున్న ఆశయాలను మనం బలపరచాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అదనపు తరగతి గదుల నిర్మాణం, ఫర్నిచర్ ఏర్పాటు, డిజిటల్ తరగతులు, లైటింగ్, డైనింగ్ హాల్స్, కాంపౌండ్ వాల్స్, పెయింటింగ్ పనులు, టాయిలెట్ల నిర్మాణం, మేజర్ మైనర్ రిపేర్లు, పరిశుభ్రమైన తాగునీరు, గ్రీన్ బోర్డులు, కిచెన్ షెడ్లు తదితర 12 అంశాలతో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, దీనిలో భాగంగానే జిల్లాలో మొదటి విడుతగా 251 ప్రభుత్వ పాఠశాలలో పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పాఠశాలకు పది లక్షలతో వసతులు కల్పించడం జరిగిందని, అలాగే సిఎస్ఆర్ క్రింద మున్సిపల్ పాలకవర్గం శ్రద్ధ పెట్టి పెయింటింగ్, సుందరీకరణ పనులను చేపట్టిందని, ఇదే విధంగా స్థానిక సంస్థల పాలక వర్గాలు పాఠశాలల పట్ల ప్రత్యేక తీసుకోవాలని, తద్వారా పిల్లల భవిష్యత్తు బంగారంగా ఉంటుందని అన్నారు. ఈ సంవత్సరం విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫామ్స్ అందజేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో మనకు భాగస్వామ్యం కలగడం సంతోషించదగిన విషయమని అన్నారు.

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఈ పాఠశాలకు అన్ని వసతులు కల్పించామని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

చివరలో పాఠశాల విద్యార్థులు రూబిక్స్ ద్వారా ఐదు సెకండ్ల లోపే గణిత ప్లెస్, మైనస్ రూపొందించడం అందరినీ అబ్బురపరిచింది.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అమరేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అమరేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎం.పి.పి. నిర్మల, జడ్పిటిసి బీరు మల్లయ్య, 19వ వార్డు కౌన్సిలర్ వి. లక్ష్మి , 8వ వార్డు కౌన్సిల్ వి.స్వామి, జిల్లా విద్య శాఖ అధికారి కె.నారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రాజేందర్, పంచాయతీరాజ్ శాఖ డీ.ఈ. సంపత్ కుమార్,ళ ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ఆండాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

…..DPRO., YADADRI.

Share This Post