Press Note 02-05-2022 మన ఊరు మన బడి కార్యక్రమంలో మొదటి విడుత క్రింద 9123 పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన చేపడుతున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

సోమవారం నాడు రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖల మంత్రి టి.హరీశ్ రావు, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీపక్కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులతో కలిసి మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా మొదటి విడుత క్రింద పాఠశాలల్లో చేపడుతున్న మౌళిక సదుపాయాల కల్పనపై జిల్లాల వారిగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాఠశాలల్లో వసతులు, ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, మొదటి విడుత క్రింద రాష్ట్రవ్యాప్తంగా 9123 పాఠశాలల్లో వసతులు మెరుగుపరచి, పాఠశాలలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ఎస్టిమేషన్స్ పూర్తి అయిన వాటిని శాంక్షన్ చేయాలని, ఒక నెలలో పనులు పూర్తి చేయాలని తెలిపారు. చిన్న చిన్న పనులు ఉన్న చోట వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని తెలిపారు. మండలానికి ఒకరిని ఇన్ఛార్జీ ఆఫీసర్ పర్యవేక్షణలో, విద్యా కమిటీల ఆధ్వర్యంలో పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి వేసవి వడగాలుల దృష్ట్యా విద్యార్థుల సౌకర్యం కొరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖల మంత్రి టి.హరీశ్రావు మాట్లాడుతూ, మన ఊరు మన బడి కార్యక్రమం ఒక విద్యా యజ్ఞం లాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 7300 కోట్లు ఈ పథకం ద్వారా పాఠశాలల మరమ్మత్తులు, పాఠశాలల్లో మౌళిక వసతుల ఏర్పాటులో భాగంగా చిన్న చిన్న సమస్యలు ఉన్న పాఠశాలల్లో వెంటనే పనులు పూర్తి చేయాలని సూచించారు . పాఠశాలలో చేపట్టే పనులను అధికారులు టీముల ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, తప్పుడు ఎస్టిమేషన్స్ లేకుండా చూడాలని తెలిపారు. పాఠశాలల్లో చేపట్టే పనులను సంబంధిత స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలను, తల్లిదండ్రులను ఆహ్వానించి ఆ పాఠశాలల్లో చేపట్టే పనులను వివరించాలని, పాఠశాలల్లో నాణ్యమైన వసతులు కల్పిస్తున్నామని తల్లిదండ్రులకు వి వరించాలని తెలిపారు. పనులను ప్రతి రోజూ సమీక్షించుకోవాలని, నాడు నేడు అనే విధానంలో పాఠశాలల్లో జరిగే పనులు, వసతుల కల్పనను ఫోటోగ్రాఫ్స్, వీడియోలతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించాలని, మనం చేసింది చెప్పుకోవాలని, పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, మన ఊరు మన బడి ద్వారా చేపట్టే మౌళిక వసతులతో విద్యా వ్యవస్థలో మంచి మార్పులు వస్తాయని, 9123 పాఠశాలల్లో మొదటి విడుత కింద చేపట్టే పనులకు ఒక వారంలోగా పూర్తి ఎస్టిమేషన్స్ సమర్పించి శాంక్షన్స్ పొందాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.

జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా చేపట్టే పనులను వివరించారు. జిల్లాలో 251 పాఠశాలల్లో మొదటి విడుత కింద పనులు గుర్తించినట్లు, వీటిలో 208 స్కూళ్లకు సంబంధించి ఎస్టిమేషన్స్ జనరేట్ చేయడం జరిగిందని, 180 స్కూళ్లలో ఎస్టిమేషన్స్ పూర్తి అయ్యాయని, వీటిలో 45 పాఠశాలల పనులకు పరిపాలన శాంక్షన్స్ ఇవ్వడం జరిగిందని, మూడు పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. అధికారులు టీముల ఏర్పాటుతో పనులను పరిశీలించడం జరుగుతున్నదని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, జిల్లా విద్యాశాఖ అధికారి నర్సింహ్మ, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున రావు, అధికారులు పాల్గొన్నారు.

 

Share This Post