Press note. 02.2.2023. స్నేహిత కార్యక్రమం ద్వారా బాలల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు.

గురువారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్లు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, మండల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎండిఓలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లతో జరిగిన రెండవ విడుత స్నేహిత అవగాహన
కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరైనారు.

ఈ సందర్భంగా ప్రభుత విప్ మాట్లాడుతూ, స్నేహిత మంచి కార్యక్రమమని, స్నేహిత ద్వారా బాలల సంరక్షణ పట్ల సామాజిక అవగాహన కలిగించడానికి చేపట్టిన కార్యక్రమాలను, స్నేహితను జిల్లాలో కొత్తగా ప్రారంభించిన జిల్లా కలెక్టరు అభినందనీయులని అన్నారు. బాలల పట్ల సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయని, వాటిని అరికట్టేందుకు చట్టాలు వున్నాయని తెలియచేస్తూ అసలు రుగ్మతలే లేకుండా ముందస్తు నివారణకు గ్రామ స్థాయి, మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, రిటైర్డ్ అధికారులతో బాలల పరిరక్షణ కమిటీల ద్వారా స్నేహిత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పిల్లల సంరక్షణ పట్ల తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనదని, తల్లిగా తండ్రిగా మన బాధ్యతలు గుర్తుంచుకోవాలని అన్నారు. సమాజంలో గర్భస్థ పిండాన్ని తీసివేయడం, భ్రూణ హత్యలు, లింగ వివక్ష వంటి రుగ్మతల పట్ల ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, పిల్లల సమస్యలు, వారికున్న హక్కుల పట్ల ప్రజలలో అవగాహన, చైతన్యం పెరగాలని అన్నారు. బాల కార్మికులను చట్టాల ద్వారా రక్షిస్తున్నామని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా బాల్య వివాహాలు తగ్గాయని అన్నారు. బాలల పట్ల శ్రద్ధ తీసుకోవడంలో అంగన్వాడీ టీచర్లది ప్రత్యేక పాత్ర అని, బాల్య వివాహాల నిర్మూలనలో ఐసీడీఎస్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో బాగా పనిచేస్తున్నారని అన్నారు. ఆడపిల్లలే కాకుండా మగ పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు శ్రద్ద తీసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన సమయం ఇవ్వాలని అన్నారు. సామాజిక రుగ్మతలు ఏర్పడకుండా వుండాలంటే తమ పిల్లలను పనికి పంపవద్దని, బాల్య వివాహాలు చేయవద్దని, వారికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కలిగించాలని అన్నారు. బాలల పరిరక్షణ కమిటీ సమావేశాలలో తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహంగా వుండే విధంగా, పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దే అంశాల పట్ల అవగాహన పెంపొందించాలని సూచించారు. అలాగే ప్రతి మూడు నెలలలోసారి పరీక్షల పోగ్రెస్ కాపీ ఇచ్చేటప్పుడు తప్పకుండా తల్లిందండ్రులను పిలవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. పిల్లలకు శారీరక దారుఢ్యం కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు అవుతున్నాయని, అలాగే పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, పిల్లలు ఏ కథలు చదివితే మోటివేట్ అవుతారో అలాంటివి ఏర్పాటు చేయాలని, ఇందుకు అందరి సహకారం తీసుకోవాలని తెలిపారు. ఇతర ప్రాంతాల నుండి కూలికి వచ్చే వారి పిల్లల పట్ల మనమే బాధ్యత తీసుకోవాలని, సంరక్షణ చర్యలు చేపట్టి పాఠశాలల్లో చదివే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కోవిద్ సమయంలో అనాథలైన పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు.

అవగాహన కార్యక్రమానికి, అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ, స్నేహిత కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆలోచన అని, స్నేహిత మన జిల్లా కార్యక్రమమని, ఇందులో ప్రజాపతినిధుల సహకారంతో క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాలని, సమాజంలో బాలల సంరక్షణకు తీసుకోవలసిన చర్యలు, బాధ్యతల పట్ల తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని, ప్రతి నెలా గ్రామ స్థాయిలో కమిటీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, బాలల హక్కులను కాపాడడమే స్నేహిత కార్యక్రమ లక్ష్యమని అన్నారు. బాలల సంరక్షణ పట్ల స్నేహిత కార్యక్రమాలను వివరిస్తూ, విద్య, వైద్యం, ఐసిడిఎస్, గామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల సమన్వయంతో అధికారులను మొత్తం 26 టీములుగా ఏర్పాటు చేసి గత జూలై, ఆగష్టు, సెప్టెంబర్ మాసాలలో ప్రతి బుధవారం మొదటి విడుత స్నేహిత కార్యక్రమంలో మొత్తం 17 మండలాలలో 271 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 43 వేల మంది విద్యార్ధినీ విద్యార్థులకు సురక్షితమైన బాల్యంపై లింగ సమానత్వం, ఆడపిల్లలు రక్షణ, హింస ప్రభావం, పిల్లల విద్య, రక్షణ చర్యలు, సురక్షిత ఇంటర్నెట్ వినియోగం, పిల్లల లైంగిక వేధింపుల నివారణ, పోక్సో చట్టం, జీవన నైపుణ్యాలు, స్వీయ రక్షణ, శరీర మూల్యాంకనం, ప్రవర్తన మార్పులు, శరీర సానుకూలత, పిల్లల అక్రమ రవాణా, బాల కార్మిక నిరోధక చర్యలు, చైల్డ్ సైకాలజీ, పాజిటివ్ పేరెంటింగ్, మంచి స్పర్శ, చెడు స్పర్శ వంటి పది అంశాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. సమాజంలో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, వాటిని అమలు చేసే విధానంపై అవగాహన పెంపొందించి బాలల రక్షణలో ఎలాంటి ఉల్లంఘనలు జరుగకుండా నిత్యం పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, స్నేహిత చిన్న స్థాయిలో పారంభించి ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో రూపుదిద్దుకొందని, ప్రజా ప్రతినిధులతో పాటు తల్లిదండ్రులు భాగస్వామ్యులు అయ్యారని, 220 వివిధ స్థాయిల అధికారులు పాల్గొన్నారని తెలిపారు. స్నేహిత అంటే ఫ్రెండ్ అని, ఫ్రెండ్ అంటే సద్బుద్ది చెప్పేవారని అన్నారు. మీ అందరి సహకారంతో స్నేహిత రెండవ విడుత అవగాహన కార్యక్రమాలు ఈ ఫిబ్రవరి మాసంలో ప్రారంభమవుతుందని, ఇందు కోసం 17 మండలాలలో 42 టీముల ఏర్పాటుతో 251 ప్యాథమిక పాఠశాలల లోని 17,058 మంది ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి చదివే బాలలకు ఐదు అంశాలు మంచి స్పర్శ చెడు స్పర్శ, విద్య ప్రాముఖ్యత, పరిసరాలపై అవగాహన, ఇంటన్నెట్ దుర్వినియోగం, ఆరోగ్యకర అలవాట్లు, భౌతిక వ్యాయామం వంటి అంశాలపై విపులంగా చెప్పడం జరుగుతుందని, ఇందుకు కోసం సూచనలు, సలహాలు అందించాలని ప్రజాప్రతినిధులను జిల్లా కలెక్టరు కోరారు.

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ మాట్లాడుతూ, జిల్లాలో ఐదు శాఖల సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో గత జూలై 22 నుండి స్నేహిత కార్యక్రమం మొదటి విడుత నిర్వహించడం జరిగిందని, అదే స్పూర్తితో స్నేహిత రెండవ విడుత నిర్వహించడం జరుగుతుందని, ప్రతి మూడవ శనివారం పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాల ఏర్పాటుతో బాలల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను విశదీకరిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ భికూ నాయక్ మాట్లాడుతూ, బాలల హక్కుల పట్ల క్షేత్ర స్థాయిలో అవగాహన ముఖ్యమని, టీనేజీలో దురలవాట్లకు పాల్పడకుండా తల్లిదండ్రులు గమనించాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలలో అధికారులందరూ పాల్గొన్నాలని అన్నారు.

అవగాహన సదస్సులో ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, బాలల సంరక్షణ, హక్కుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చట్టాల అమలు పట్ల సూచనలు, సలహాలు అందచేశారు.

జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిహెచ్. కృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, సిడిపిఓ శైలజ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగలక్ష్మి, బాలల సంరక్షణ అధికారి సైదులు స్నేహిత కార్యక్రమ ఉద్దేశ్యాలను, బాలల పరిరక్షణ కమిటీల వివరాలను వివరించారు.

తొలుత స్నేహిత కార్యక్రమ లోగోను ఆవిష్కరించారు.

కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

……DPRO., YADADRI.

Share This Post