Press Note 06-5-2022 వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో వుండాలని, రైతు వేదికల ద్వారా వ్యవసాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి ఆదేశించారు.

 

శుక్రవారం నాడు కలెక్టరేటు మీటింగ్ హాలులో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్స్, మండల వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారులతో వానా కాలం సాగు సమాయత్తంపై సమీక్షా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ పంట, ప్రత్యామ్నాయ పంటలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగంపై జిల్లా, క్లస్టర్ వారిగా వ్యవసాయ క్యాలెండర్ వెంటనే రూపొందించాలని, మండల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణాధికారులు తప్పనిసరిగా ఆఫీసు ఏర్పాటు చేసుకొని పనులు నిర్వహించాలని, తరచూ రైతు వేదికలలో పంటల సాగు, ఎరువులు, మందుల వినియోగంపై రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు. వ్యవసాయ విధానంలో ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం, రైతు సంక్షేమ పథకాలపై ఫ్లెక్సీల రూపంలో రైతు వేదికలలో ప్రదర్శించాలని ఆదేశించారు. రైతులకు పంటల సాగుపై వివరంగా అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలని, డైరెక్ట్ సీడింగ్ ప్యాడీ విత్తనాలు వెదజల్లే పద్ధతులపై, పచ్చిరొట్ట ఎరువుల వాడకంపై ఇంకా విస్త్రత అవగాహన కలిగించాలని, పచ్చిరొట్ట ఎరువులపై ప్రభుత్వం కల్పించే సబ్సిడీ గురించి రైతులకు తెలుపాలని అన్నారు. డిపిఎపి, పొటాషియం ఎరువు రెండు మూడు దఫాలుగా వినియోగించే పద్ధతులు, ఎరువును నీటి ద్వారా వినియోగించే పద్దతులపై, కంది, పత్తి పంటల సాగు పెరిగేలా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కలిగించాలని, క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. అలాగే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎఇఓలు అందుబాటులో వుండాలని, రైతుల నుండి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమీక్షా కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.

Share This Post