Press note. 07.5.2022. వచ్చే వానకాలం సీజన్ లో రైతులకు వ్యవసాయ సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పద్ధతులపై రైతు వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అధిక దిగుబడులు, లాభాలు పొందేలా రైతులను సమాయత్తం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

 

శనివారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హలులో వ్యవసాయం ఏ.డి.లు, మండల అగ్రికల్చర్ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో వానాకాలం 2022 పంటల సాగు, యాజమాన్యం పద్ధతులపై అవగాహన సదస్సు కార్యక్రమంలో వచ్చే వానకాలం సీజన్ లో సాగుపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 92 రైతు వేదికల ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారులు కార్యాలయం ఏర్పరచుకొని పనిచేయాలని, రైతు వేదికల ద్వారా వ్యవసాయ సాగు పద్ధతులు, నూతన సాంకేతిక విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రైతులతో ఎలాంటి సమావేశాలు నిర్వహించినా రైతు వేదికలలోనే నిర్వహించాలని ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ఉదయం క్షేత్రస్థాయిలో పని చేసినప్పటికీ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు రైతు వేదిక లో రైతులకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, సాగు పద్ధతులపై ఎప్పటికప్పుడు సలహాలు అందించాలని తెలిపారు. వరి సాగులో వెదజల్లే పద్ధతిని రైతులకు వివరించాలని, దాని వల్ల అధిక లాభాలు కలుగుతాయని రైతులకు అవగాహన పెంచాలని అన్నారు. ప్రతి మంగళ, శుక్రవారం రైతు వేదికల ద్వారా నూతన సాగు పద్ధతులపై తప్పనిసరిగా శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. భాస్వరపు జీవన ఎరువులు బయో ఫెర్టిలైజర్స్ వాడకంలో రైతులకు కలిగే లాభాలను విశదీకరించాలని తెలిపారు. ఎరువులు ఒకే దఫా కాకుండా మూడు నాలుగు దఫాలుగా ఉపయోగించేలా రైతులకు సూచనలు ఇవ్వాలని, తద్వారా పంట నాణ్యత ఉంటుందనే అనే విషయం రైతులకు వివరించాలని తెలిపారు. కమర్షియల్ పంటల వలన రైతులకు అధిక లాభాలు వస్తాయని, దీనిలో భాగంగా కందులు, ప్రత్తి సాగు విస్తీర్ణం పెంచేలా క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. హైటెన్సిటీ కాటన్ విత్తనాలను వినియోగించాలని, తద్వారా అధిక పత్తి దిగుబడి వస్తుందని రైతులకు వివరించాలని తెలిపారు. పచ్చిరొట్ట ఎరువుల వలన నేల సారవంతంగా అవుతుందని రైతులకు అవగాహన కల్పించి పచ్చిరొట్ట ఎరువు వాడకం పెంచాలని తెలిపారు. ఈ నెలలో ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులతో తిరిగి సమావేశం కానున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి మాట్లాడుతూ, వ్యవసాయ అధికారులు రైతులతో అవగాహన తరగతులు ఏర్పాటు చేసుకొని అధిక దిగుబడులు, లాభాలు వచ్చే విధంగా క్షేత్రస్థాయిలో పని చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అనురాధ, జిల్లా ఉద్యాన వన అధికారి శ్రీమతి అన్నపూర్ణ పాల్గొన్నారు.

Share This Post