Press Note 17.3.2023 వినియోగదారుల హక్కుల రక్షణకు అందరం కలిసి కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి వియోగదారుల సంఘాల ప్రతినిధులను కోరారు.

శుక్రవారం నాడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 15వ తేదీన “ప్రపంచ వినియోగదారుల దినోత్సవం” పురస్కరించుకొని వివిధ వినియోగదారుల సేవా సంఘాల ప్రతినిధులతో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వినియోగదారుల హక్కుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించే అవసరం ఉందని, వినియోగదారుల సంఘాల ప్రతినిధుల సహకారంతో అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని, ప్రజలకు వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకునేందుకు వీలుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2023 సందర్భంగా “స్వచ్ఛమైన ఇంధన పరివర్తన ద్వారా వినియోగదారులకు సాధికారత కల్పించడం” అనే అంశం ఈ సంవత్సరం ప్రతిపాదించుకోవడం జరిగిందని, ఇందులో భాగంగా సోలార్ శక్తిని వినియోగించుకోవడంలో 20 శాతం సబ్సిడీని ప్రభుత్వ ఇస్తుందని తెలిపారు. సోలార్ శక్తిని వినియోగించుకోవాలని, నీరు, గాలి, సూర్యరశ్మి ద్వారా పొల్యూషన్ లేని ఇంధనం ఉత్పత్తి అవుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని సోలార్ శక్తిని వినియోగించుకునేందుకు వినియోగదారుల ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. కార్యక్రమంలో వినియోగదారుల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అందరం కలిసి కృషి చేయాలని అన్నారు.

కార్యక్రమంలో వినియోగదారుల సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలను కమిటీ దృష్టికి తెచ్చారు. దివిస్ పరిశ్రమ వలన ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయని, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలను నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలని, మెడికల్ షాపులలో డ్రగ్ లైసెన్సులు, మందుల డిస్కౌంట్స్, ప్రిస్క్రిప్షన్ పై తనిఖీలు చేపట్టాలని, ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ చాలా ముఖ్యమని, ఫార్మాస్యూటికల్ షాపులలో లైసెన్స్ సర్టిఫికెట్లను తనిఖీ చేయాలని, జెనరిక్ మందుల ఎమ్మార్పీ రేట్లపై నియంత్రణ ఉండాలని, ఆహార పదార్థాల కల్తీపై వినియోగదారులకు అవగాహన కలిగేలా క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలు సంబంధిత శాఖలు చేపట్టాలని, రైతు బజార్లలో రేట్ల పట్టికలు ప్రకారం అమ్మేలా చూడాలని, అది కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పెట్రోల్ బంకులలో పెట్రోల్ సరిగా ఉండేలా కొలతలపై తనిఖీలు, కల్తీలపై నిరంతర నిఘా ఉండాలని, మీ సేవ కేంద్రాలలో అధిక ధరలు వసూలు చేయకుండా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో బయట మందులు రాయకుండా చూడాలని, ఆస్పత్రులలో వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఫుడ్ సేఫ్టీ ఆహార కల్తీ నిరోధకానికి ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ జిల్లా ఆఫీసులను ఏర్పాటు చేయాలని, వినియోగదారుల వివాదాల నివారణ కమిషన్ ఏర్పాటు చేయాలని, కొన్నవారు తప్పని సరిగా రసీదులు పొందేలా చూడాలని, ఆర్టీసీ వారు భువనగిరి పట్టణంలో లోకల్ బస్సులను ఏర్పాటు చేయాలని, రాత్రిపూట నేషనల్ హైవే మీదుగా వెళ్లే బస్సులను భువనగిరిలో ఆగి వెళ్లేలా చర్యలు చేపట్టాలని, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలను అక్కడే ఉంచి జిల్లా విద్యాశాఖ ఆఫీసును అక్కడి నుండి మార్చివేయాలని, తద్వారా పాఠశాలలో చదువుతున్న బాలల హక్కులను కాపాడాలని, ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు తల్లిదండ్రుల నుండి ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నందున తనిఖీలు చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి, సివిల్ సప్లై డి.ఎం. గోపికృష్ణ, జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ భారతి, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ సబిత, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి నీలిమ, డ్రగ్ ఇన్స్పెక్టర్ అశ్విన్ కుమార్, తూనికలు కొలతల అధికారి సంజయ్ కృష్ణ, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ రాజీవ్ కుమార్, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు కొలను శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ అంజయ్య, వివిధ వినియోగదారుల సంఘాల ప్రతినిధులు కొడారి వెంకటేష్, చంద్రశేఖర్, బాలేశ్వర్, జయప్రకాష్, వెంకటాచారి, శంకర్ జిల్లా రేషన్ షాప్ డీలర్ల అధ్యక్షుడు రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

……DPRO., YADADRI.

Share This Post