Press Note 24-05-2022 రాజ్యాంగపరంగా, చట్టపరంగా మహిళలకు కల్పించిన హక్కులను కాపాడటం మహిళా కమిషన్ బాధ్యత అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.

మంగళవారం నాడు జిల్లా కలెక్టరు కార్యాలయం మీటింగ్ హాలులో వివిధ మహిళా సంఘాలు, ఆశా, ఎఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయితీ సెక్రటరీలతో మహిళా హక్కులు, సాధికారతపై జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆమె విచ్చేశారు.

జిల్లా, కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు శ్రీమతి షహీన్ అఫ్రోజ్, శ్రీమతి కుమ్మ ఈశ్వరీబాయి, శ్రీమతి కొమ్ము ఉమాదేవి, శ్రీమతి గద్దల పద్మ, శ్రీమతి సుద్ధం లక్ష్మి, శ్రీమతి కటారి రేవతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి శ్రీమతి కృష్ణవేణి పాల్గొన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రటరీ శ్రీమతి కృష్ణవేణి కమిషన్ నిర్వహించే బాధ్యతలను వివరించారు. మహిళా సంఘం ప్రతినిథి శ్రీమతి ప్రశాంతి, జిల్లా బాలల సంక్షేమ కోఆర్డినేటరు శ్రీమతి బండారు జయశ్రీ, సఖీ కేంద్రం కోఆర్డినేటరు శ్రీమతి ప్రమీల, గ్రామీణ మహిళా రైతు సమితి అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీమతి యశోద మహిళల హక్కులు, బాధ్యతలపై ప్రసంగించారు. హైకోర్టు అడ్వకేటు శ్రీమతి మంజూష మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, గృహ హింస సంబంధించిన రక్షణ చట్టాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ, అన్ని సేవా రంగాలు, సంస్థలు, కుటుంబ వ్యవస్థలలో మహిళలు, బాలికలకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా కల్పించిన హక్కులను కాపాడటం కమీషన్ బాధ్యత అని తెలిపారు. ఇలాంటి అవగాహన సదస్సుల ద్వారా ఆశా, అంగన్వాడీ, ఎఎన్ఎం, మహిళా సంఘాలు క్షేత్రస్థాయిలో మహిళలకు కల్పించే రక్షణ చట్టాలపై, హక్కులపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని, మహిళా చట్టాలు కేవలం మహిళలే కాదు పురుషులు కూడా తెలుసుకోవాలని, తద్వారా మహిళలకు కల్పించిన హక్కుల పట్ల అవగాహన కలుగుతుందని అన్నారు. మహిళలు ఎక్కడ ఇబ్బందులకు గురవుతారో అక్కడికి వెళ్లడం, సుమోటోగా కేసు తీసుకోవడం, విద్యా సంస్థలు, వసతి గృహాలు, వర్కింగ్ ఉమెన్ సెంటర్లు తనిఖీ చేసే అధికారం కమీషన్ కు వుందని తెలిపారు. కుటుంబ వ్యవస్థలో చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారని, లింగ సమానత్వం లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. మహిళా రక్షణకు అనేక చట్టాలు తేవడం జరిగిందని, వరకట్న నిషేధ చట్టం, హిందూ వివాహ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం నిర్భయ చట్టం, ఫోక్సో చట్టం, సీనియర్ సిటిజెన్ ప్రొటెక్షన్ మెయిన్టన్స్ చట్టాలు తేవడం జరిగిందని, కేవలం రక్షణ కొరకే కాకుండా వారికి సమాజంలో భద్రత కల్పించే విషయంలో కూడా అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని, వీటన్నింటిపై మహిళలకు అవగాహన కలిగించాలని, జెండర్ ఈక్వాలిటే దీనికి సానుకూలత అని అన్నారు. సమాజంలో అంటే మనలో మనమని, ఆడ మగ సమానత్వంగా వ్యవహరించాలని అన్నారు. 108 సఖి హెల్ప్ లైన్ ద్వారా, 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా లేదా పోస్టల్, ట్విట్టర్, ఇ మెయిల్ తదితర మార్గాల ద్వారా లేదా కమీషన్ నెంబర్ 9490555533 కు మహిళలు సమస్యలను తెలుపవచ్చునని, వారికి అండగా కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని, ప్రభుత్వం కల్పించే వసతి ఏర్పాట్లను బాధితులు ఉపయోగించుకోవాలని, స్మార్ట్ ఫోన్ ద్వారా తమ వ్యక్తిగత డిటైల్స్ ఇతరులతో పంచుకోవద్దని అన్నారు. మ్యారేజీ యాక్టు ప్రకారం ప్రతి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, గ్రామాలలో పంచాయితీ సెక్రటరీలు మ్యారేజీ రిజిస్ట్రేషన్స్ పై మహిళలను చైతన్యపరచాలని తెలిపారు. జిల్లా లీగల్ సెల్ ద్వారా ఉచిత న్యాయసేవలు అందించడం జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల ఆరోగ్యం, సంక్షేమం పట్ల అనేక పథకాలు చేపట్టారని, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలలో నాణ్యమైన భోజన వసతి, విద్య కల్పించారని, అంబేద్కర్ ఓవర్సీస్ నిధి ద్వారా విదేశీ చదువులకు 20 లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తున్నారని, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆడపిల్లల వివాహాలకు ఆర్ధిక మనోబలం కల్పించారని, ఆరోగ్య లక్ష్మి, కెసిఆర్ కిట్స్ ద్వారా మాతా శిశువులకు ఆరోగ్య, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని, మహిళలు అన్నింటిలో ఎదగాలని, మహిళల ఆలోచనలకు అనుగుణంగా అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారని అన్నారు. షీ – టీములు, సఖీ సెంటర్స్ ఏర్పాటు, సైబర్ టీముల ఏర్పాటు, ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటుతో మహిళలు మోసపోకుండా రక్షణాత్మక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. హింస లేని సమాజం కోసం మన వంతు కృషి చేద్దామని తెలిపారు.

మహిళ హక్కులను కాపాడతామని, వారి గౌరవానికి భంగం కలిగే ఏ చర్యా చేపట్టనని ప్రతిజ్ఞ చేయించారు.

అంతకు ముందు మహిళా కమిషన్ చైర్పర్సన్, బృందం సభ్యులు భువనగేరి పట్టణంలోని కృషి ఐటీఐ బాలికల వసతి గృహాన్ని, ఎస్.సి. బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. భోజన వసతులను పరిశీలించారు.

అనంతరం సఖీ సెంటర్ ను పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని కేసులకు ఎన్ని పరిష్కారం అయ్యాయి పరిశీలించారు. గృహ హింస, బాలికలపై అఘాయిత్యాల పట్ల బాధితులకు చట్టాలు ఏ విధంగా రక్షణ కల్పించింది అవగాహన కలిగించాలని, సఖీ సెంటర్ల ద్వారా మరిన్ని సేవలు అందించాలని సూచించారు.

రాజ్యాంగపరంగా, చట్టపరంగా మహిళలకు కల్పించిన హక్కులను కాపాడటం మహిళా కమిషన్ బాధ్యత అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.

Share This Post