Press Note 24-5-2022 ప్రభుత్వం మహిళలకు కల్పించిన రక్షణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలును పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సుసీతా లక్ష్మారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.

మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయ మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్మ ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుద్దం లక్ష్మి, కటారి రేవతి లతో కలిసి జిల్లాలో మహిళల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న రక్షణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలును జిల్లా అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఋణాలు, స్త్రీ నిధి ఋణాలు లక్ష్యాలకు పైగా ప్రగతి సాధించడం పట్ల, శుక్రవారం సభల ద్వారా గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు, తల్లులకు కలిగిస్తున్న సాధారణ ప్రసవాలు, పోషక ఆహారంపై అవగాహన కార్యక్రమాల పట్ల జిల్లా కలెక్టరును అభినందించారు. కోవిద్ సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్న మహిళలను గుర్తించి వారి జీవనోపాధికి యూనిట్లు మంజూరు చేయాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఆడమగ లింగ నిర్ధారణ చేసే హాస్పిటల్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలని, స్కానింగ్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. లింగ భేదం తెలుసుకొని ఆడపిల్ల అయితే అబార్షన్లు చేయించుకుంటున్నారని, తద్వారా మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. మహిళలు పోలీసు స్టేషన్ వస్తే వారి పట్ల గౌరవభావం చూపాలని, అవసరమున్న చోట సఖీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లకు పంపాలని, మహిళా పోలీసు, మహిళా హోమ్ గార్డ్ లను ఏర్పాటు చేయాలని, మారుమూల పోలీసు స్టేషన్లలో తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎన్ఆర్ఐ కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని, బాధిత మహిళలకు త్వరగా న్యాయం అందాలని సూచించారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో షీ టీముల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల వైద్య శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, గ్రామ స్థాయి నుండి అవగాహన కలిగించాలని సూచించారు. అన్ని సంక్షేమ హాస్టల్స్లో బాలికలకు అందిస్తున్న భోజన మెనూను తప్పనిసరిగా డిస్ ప్లే చేయాలని సూచించారు.

జిల్లా కలెక్టరు పమేలా సత్పతి మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి వారం శుక్రవారం సభ ప్రతి అంగన్వాడీలలో జరుగుతుందని, గర్భిణీ, మాతా శిశువులకు వైద్య సిబ్బంది, ఆశా, ఎఎన్ఎం సిబ్బందితో సాధారణ ప్రసవాల పట్ల, పోషక విలువలు వున్న ఆహారం తీసుకోవడంపై వివరించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో ఒక లక్షా 55 వేల మహిళా స్వయం సహాయక సభ్యులు ఉన్నారని, 14,841 స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయని, 561 గ్రామ సమాఖ్యలు పనిచేస్తున్నాయని, వీరికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, గత సంవత్సరం 386 కోట్లు ఋణాలకు గాను 410 కోట్లు ఋణ సౌకర్యం కల్పించడం జరిగిందని, మహిళల ఆర్దిక, ఆరోగ్య పురోగతి కోసం నెలకు రెండు సార్లు వారితో క్షేత్రస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యల పట్ల సమిక్షించడం జరుగుతున్నట్లు తెలిపారు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు నారాయణరెడ్డి జిల్లాలో పోలీసు శాఖ మహిళల భద్రత పట్ల తీసుకుంటున్న చర్యలను వివరించారు. షీ టీములు బాగా పనిచేస్తున్నాయని, దేశవ్యాప్తంగా మన షీ టీములను ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. కట్నం వేధింపులు, మహిళల వేధింపులను ఆరు విభాగాలుగా పరిశీలిస్తున్నామని, మిస్సింగ్ కేసుల విషయంలో మైనర్లు అయితే కిడ్నాప్ కేసులుగా నమోదు చేస్తున్నామని, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి చేర్చుతున్నామని, రేప్ కేసులలో నిందితులకు శిక్ష పడే వరకు అన్ని స్థాయిలలో కృషి చేస్తున్నామని, ఈవ్ టీజింగ్ కేసులకు సంబంధించి నిఘా ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు తెలిపారు. కళా బృందాల ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్లి మహిళలు, చిన్నారుల పట్ల అన్యాయాలు జరిగితే పోలీసు వారికి ధైర్యంగా ఎలా రిపోర్టు చేయాలి, ఎలా రక్షణ చర్యలను పొందాలి అని అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. బయట రాష్ట్రాలలో వున్న మన మహిళలను కూడా కాపాడడం జరిగిందని, కుటుంబ కలహాల పట్ల కూడా సానుకూలతతో కౌన్సిలింగ్ చేయడం, ఫోక్సో కేసుల పట్ల పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఐసిడిఎస్, వివిధ సంక్షేమ శాఖల అధికారులు మహిళా అభివృద్ధి కార్యక్రమాల పట్ల వివరించారు.

ప్రభుత్వం మహిళలకు కల్పించిన రక్షణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలును పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సుసీతా లక్ష్మారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.

Share This Post