మంగళవారం నాడు జిల్లా కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాలులో ఓటు నమోదు ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో జిల్లా కలెక్టరు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో రేపు బుధవారం నుండి వచ్చే డిసెంబరు 7 వ తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమంపై విద్యార్థులకు తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. వచ్చే డిసెంబరు 3, 4 తేదీలలో నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలపై ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటరు నమోదు, సవరణ దరఖాస్తు ఫారములు అందుబాటులో వుంటాయని, ఓటర్లు తమ వివరాలను పరిశీలన చేసుకునేందుకు సంబంధిత ఓటరు జాబితా అందుబాటులో వుంటుందని, దరఖాస్తు చేసుకునేందుకు బూత్ స్థాయి అధికారులు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. నూతనంగా ఓటు నమోదు కొరకు ఫారం 6 ,ఓటరు జాబితాలో పేరు తొలగించడం కొరకు ఫారం -7, చిరునామా మార్పు, వివరాల సవరణ, ఓటరు కార్డు భర్తీ, వైకల్యం ఉన్న వ్యక్తుల గుర్తింపు కొరకు ఫారం-8 లను వినియోగించడంతో పాటు ఆన్ లైన్, ఓటరు హెల్ప్ లైన్ యాపుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఓటరు నమోదుకు వచ్చే డిసెంబర్ 8 వ తేదీ ఆఖరు తేదీ అని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రమణి, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు, కలెక్టరేటు సూపరింటెండెంట్ కె. నాగలక్ష్మి, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.