మంగళవారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సూక్ష్మ తరహా పరిశ్రమలు (PMEGP), సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ (PMFME) పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించబడింది. కార్యక్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేతలు పాల్గొన్నారు.
అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవాలని, నూతన ఆలోచనలతో యూనిట్లు నెలకొల్పి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు. బ్యాంకు ఋణాలు నిర్ణీత సమయంలో చెల్లించినట్లయితే ముందు ముందు బ్యాంకుల సహకారంతో ఇంకా వృద్ధి చెందవచ్చునని అన్నారు. ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎన్నో నూతన ఆలోచనలతో యూనిట్లు నెలకొల్పుతున్నారని, యువత, మహిళా సంఘాల సభ్యులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు శ్రీలక్ష్మి మాట్లాడుతూ, సూక్ష్మ తరహా పరిశ్రమలకు సంబంధించి తయారీ రంగానికి గ్రామీణ ప్రాంతాలలో 25 శాతం, పట్టణ ప్రాంతాలలో 15 శాతం, మహిళలు, ఎస్సీ, ఎస్టీ సంబంధించి గ్రామీణ ప్రాంతంలో 35 శాతం, పట్టణ ప్ర్రాతంలో 25 శాతం సబ్సిడీ క్రింద, సూక్ష్మ ఆహార పరిశ్రమ రంగంలో 35 శాతం సబ్సిడీ ప్రోత్సాహకం లభిస్తుందని తెలిపారు.
అవగాహన సదస్సులో డిస్ట్రిక్ట్ లీడ్ మేనేజరు శివరామకృష్ణ, కెవిఐసి అసిస్టెంట్ డైరెక్టరు నారాయణరావు, MSMEDI అసిస్టెంట్ డైరెక్టరు నవీన్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిపిఎం సునీల్, తదితరులు పాల్గొన్నారు.