బుధవారం నాడు భువనగిరి మున్సిపల్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్షంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించబడింది.
కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు, తల్లులకు చిరు ధాన్యాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ తొలుత జ్యోతి ప్రజ్యలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పోషణ పక్షోత్సవాలలో అంగన్వాడీ కేంద్రం స్థాయి, ప్రాజెక్టు స్థాయి, జిల్లా నెలలో స్థాయిలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయని, కళాశాల, పాఠశాల స్థాయిలలో వ్యాస రచన పోటీలు, అనీమియా పరీక్షలు, సమభావన సంఘాలకు, కిశోర బాలికలకు అనీమియా పరీక్ష, చిరు ధాన్యాల ప్రాముఖ్యత, ఆరోగ్యంపై డాక్టర్స్ టాక్, అనీమియా క్యాంపులు, కిచెన్ గార్డెన్ల ప్ర్రాముఖ్యత, కళాశాలలో సెమినార్లు, యోగా క్లాసులు, పోషణ పంచాయత్ లు తదితర కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పోషకాలతో నిండిన చిరు ధాన్యాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని, అనేక రోగాలను నయం చేయడానికి ఉపయోగపడతాయని, అనే విధంగా బిడ్డ యొక్క మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యతలో తల్లి పాత్ర, అవసరం ఎంతో ఉందని, బిడ్డ ఆరోగ్యంగా వుండాలంటే మొదటగా తల్లి ఆరోగ్యంగా ఉండాలని, వ్యాధుల నుండి రక్షణకు ప్రభుత్వం వద్దనే టీకాలు వేయించుకోవాలని, ప్రతి గర్భిణీ స్త్రీ అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే శుక్రవారం సభలలో పాల్గొనాలని, వారు ఇచ్చే సూచనలను పాటించడం పట్ల ఆరోగ్యంగా ఉంటామని, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రంలో బరువు తీయించుకోవాలని, వారిచ్చే సూచనలను పాటించి. పోషణ లోపం లేకుండా చేయాలని అన్నారు. జిల్లాలో శుక్రవారం సభల ద్వారా మహిళల్లో ఐరన్ తీసుకునేలా ప్రోత్సహిస్తూ 70 శాతం ఉన్న అనీమియాను 40 శాతానికి తగ్గించామని, చిరు ధాన్యాలు మనం తింటూ పక్క వారికి తెలియచెప్పాలని, చిరుధాన్యాలను పండించే వారిని ప్రోత్సహించాలని కోరారు.
ఈ సందర్భంగా చిరుధాన్యాల అవసరంపై రూపొందించిన పోషణ పక్షం అవగాహన పోస్టర్స్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో భువనగిరి ఎంపిపి నరాల నిర్మల, జడ్పిటిసి బీరు మల్లయ్య, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, డిప్యూటీ వైద్య అధికారి యశోద, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి జోసెఫ్, సిడిపిఓ స్వరాజ్యం, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
….DPRO., YADADRI.