Press note. 30.12.2021. మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఆదర్శవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, పట్టణ ప్రగతికి తోడ్పడాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు.

గురువారం నాడు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ లు, మున్సిపాలిటీ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన పట్టణ ప్రగతి, స్వచ్ఛ సర్వేక్షణ్ – 2022 వర్చువల్ ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజాప్రతినిధులను, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్యం, పచ్చదనం, వైకుంఠధామాలు, డంప్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు, ఇంటింటా తడి చెత్త పొడి చెత్త సేకరణ తదితర కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పట్టణ ప్రగతి ద్వారా నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో 2021 సంవత్సరం తెలంగాణ సఫాయి ముద్ర చాలెంజ్ లో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచిందని, ఇది ఆనందించదగిన విషయమని, దీంతో సంతృప్తి పడకుండా మరింత స్ఫూర్తితో మొదటి స్థానం వచ్చేలా కృషి చేయాలని కోరారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏక కాలంలో గ్రామాలు, పట్టణాలు సమ్మిళితమైన, సమతుల్యమైన పద్ధతులలో, వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అటు ఐటీ రంగాన్ని, ఇటు గ్రామీణ అభివృద్ధిని, వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి వివిధ ప్రోత్సాహకాలతో నడిపిస్తున్నారని, పల్లెలను పట్టణాలతోపాటు దీటుగా పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం చేపడుతున్నారని, కేంద్రం ప్రకటించిన పల్లె వికాసం అవార్డులో మనమే ముందు ఉన్నామని, ఇటు పట్టణాలకు సంబంధించి మనమే ముందు ఉన్నామని, తెలంగాణ అగ్రభాగాన ఉంటున్నదని‌, తెలంగాణ ఒక కొత్త విజయవంతమైన రాష్ట్రంగా నిరంతర అభివృద్ధితో పయనిస్తున్నదని అన్నారు. పట్టణ ప్రగతి కింద ఇప్పటివరకు రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 3045 కోట్లు అందించడం జరిగిందని తెలిపారు. ఒకప్పుడు మునిసిపాలిటీలలో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతినెలా ఠంఛనుగా వారికి వేతనాలు చెల్లిస్తూ, నిధులు కేటాయించుకునే స్థితికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని అన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా పచ్చదనం కార్యక్రమాల కోసం 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించుకొని వివిధ పనులు నిర్వహిస్తూ పచ్చదనానికి తోడ్పడుతున్నామని, 2021-22 సంవత్సరంలో మునిసిపాలిటీలకు 223 కోట్లు కేటాయించడం జరిగిందని, ఒకవైపు బృహత్తరమైన కాలేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేసుకున్నామని, ఎనిమిది శాతం గ్రీన్ కవర్ చేసి పర్యావరణానికి తోడ్పడ్డామని అన్నారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TUFIDC కింద 3 వేల కోట్లతో పట్టణాలలో వివిధ అభివృద్ధి పనులు కనపడుతున్నాయని అన్నారు. గత అక్టోబర్ రెండో తారీకు వరకు ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్ ప్రకారం 14000 కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించుకున్నామని, తద్వారా పట్టణాలకు వచ్చే మహిళలు, వృద్ధులు, పిల్లలకు బహిరంగ మల మూత్ర విసర్జనకు ఇబ్బంది కలగకుండా టాయిలెట్ల సౌకర్యం కల్పించడం జరిగిందని, మహిళలకు షీ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. టాయిలెట్స్ కట్టడం చాలా సులువు అని, అది ప్రజలు వినియోగించే స్థాయిలో మెయింటినెన్స్ కోసం మున్సిపాలిటీలు పనిచేయాలని, ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయాలని, ప్రత్యక్షంగా కనిపించే ఇలాంటి ముఖ్యమైన పనుల పట్ల తగిన చర్యలు తీసుకోవాలని, అదనపు కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలని, ఎక్కడైనా అలసత్వం, నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని తెలిపారు. అర్బన్ మిషన్ భగీరథ పనులు పూర్తి అవుతున్నాయని, దేశంలోనే మిషన్ భగీరథ గొప్ప కార్యక్రమమని, ప్రతి ఇంటికి మంచినీరు అందేలా సవ్యమైన పద్ధతిలో ప్రజలకు సరైన సేవలు అందించే దిశలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పనిచేయాలని తెలిపారు. 2020 -21 సంవత్సరంలో వెజ్ నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలకు 500 కోట్లు కేటాయించడం జరిగిందని, వచ్చే జూన్ లోగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని, వైకుంఠ ధామాల పనుల కోసం 200 కోట్లు కేటాయించడం జరిగిందని, వీటిని కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, స్థల సమస్యలు ఉన్నచోట వెంటనే పరిష్కరించాలని, మనం పని చేస్తే అవార్డులు వాటంతట అవే వస్తాయని అన్నారు. వైకుంఠధామాలు, డంప్ యార్డులు, టాయిలెట్లు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు, తడి చెత్త పొడి చెత్త సేకరణ, సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ, తదితర కార్యక్రమాలలో మెప్మా సంఘాల భాగస్వామ్యంతో నిర్వహించాలని సూచించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా పట్టణ అభివృద్ధి కోసం ప్రతి నెల ఠంఛనుగా నిధులు విడుదల చేస్తున్నామని, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులతో పాటు, విధులను కూడా నిర్వర్తించారని, కొత్త మున్సిపాలిటీ చట్టంలో స్పష్టంగా దిశానిర్దేశం చేశారని అన్నారు. వచ్చే ఫిబ్రవరి 24 వ తారీఖున పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా మునిసిపాలిటీలలో చేసిన పనులకు పురస్కారాలు అందించడం జరుగుతుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి జిల్లాలో స్థానిక సమస్యల నివారణ కోసం ఒక ఐ.ఎ.ఎస్. స్థాయి అధికారిని ముఖ్యమంత్రి నియమించారని అన్నారు. ప్రజల దైనందిక సమస్యలైన మంచినీరు, వీధి దీపాలు, దోమలు పందుల బాధ నివారణ, పారిశుధ్యం పనులను నిర్వహించి, ప్రజలకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. మనం చేపట్టే పనులలో సిటిజన్ ఎంగేజ్మెంట్ పనులలో మహిళలు, ఉత్సాహవంతమైన యువత, రిటైర్డు అధికారులు, విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా వార్డు కమిటీలను పటిష్టం చేయాలని, కార్యక్రమాలలో అందరిని మమేకం చేస్తూ నిర్వహించాలని సూచించారు. మనం చేసే పనిలో కళాత్మకత ఉండాలని, మనం చేసే పనులు ప్రజలకు అవగాహన కలిగే విధంగా వాల్ పెయింటింగుల ద్వారా మరింత సుందరంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో సిటిజన్ సర్వీస్ సెంటర్ రిసెప్షన్ కౌంటర్ తప్పనిసరిగా ఉండాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని, రిసెప్షన్ కౌంటర్ లేని చోట వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా కారణంగా ప్రజలు డిజిటల్ సేవల వైపు మల్లారని, అధికారులు కూడా సోషల్ మీడియాలో చురుకుగా ఉండి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. కమర్షియల్ ప్రాంతాలలో కావలసిన పనులపై పక్కా కార్యాచరణ చేపట్టాలని, భవన నిర్మాణాల వ్యర్థ కుప్పలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పనులపై అవసరమైతే ప్రజా ప్రతినిధులకు, అధికారులకు కూడా స్టడీ టూర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో గంగదేవిపల్లి గ్రామం ఒక్కటే ఆదర్శ గ్రామంగా ఉండేదని, ఇప్పుడు ప్రతి పల్లె కూడా ఆదర్శ గ్రామంగా తయారవుతున్నదని, మన శరీరాన్ని ప్రతి రోజూ శుభ్రం చేసుకునే విధంగానే మన పట్టణాలను ప్రతి రోజూ శుభ్రం చేయాలని, ఇది నిరంతర కార్యక్రమమని, ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. వీధులలో నేమ్ బోర్డులు అమర్చాలని, చేసిన పనులపై కరపత్రాలు, బుక్ లెట్స్ రూపంలో ప్రజలకు తెలపాలని అన్నారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక వెబ్ సైట్ ఉందని, లేనిచోట వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన పట్టణాలు, పచ్చదనం పెంపొందించే దిశగా పట్టణ ప్రణాళిక అభివృద్ధి చేయాలని, స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపాలని అన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ ఫర్ సిటీ మేనేజర్స్ యాప్ ను ఆయన విడుదల చేశారు.

రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎం.డి., ఎస్.బి.ఎం. అరవింద్ కుమార్ పరిశుభ్రమైన పట్టణం, స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు చేపట్టవలసిన కార్యక్రమాలను వివరించారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం 2016లో ప్రారంభమైందని, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమమని, దేశంలో మొత్తం 4220 పట్టణాలలో కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిలో 8 కేటగిరీలలో అవార్డులు పొందే అవకాశం ఉందని, మనం చేస్తున్న పనులు ప్రపంచానికి తెలియాలంటే అవార్డులు కూడా ముఖ్యమని, ప్రజా ప్రతినిధులు, అధికారులు అభివృద్ధి కార్యక్రమాలలో మమేకం కావాలని అన్నారు.

అవగాహన సదస్సులో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ, ప్రొఫెసర్ శ్రీనివాసాచారి, నిపుణులు కే.వీ. రంజిత్, ఉదయ్ సింగ్, శ్రీనివాస్ అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, మోత్కూర్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి సావిత్రి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి సుధ, పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు

మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఆదర్శవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, పట్టణ ప్రగతికి తోడ్పడాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు.

Share This Post