Press note. Dt. 29-04-2022 హరితహారం ఈ కార్యక్రమంలో 19 కోట్ల 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

శుక్రవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హైదరాబాద్ బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి వీడియోకాన్పరెన్స లో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, పిసిసిఎఫ్ డోబ్రియల్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, హరితహారం ఓఎస్ డి శ్రీమతి ప్రియాంక వర్గీస్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం, దళిత బంధు, యాసంగి వరి ధాన్యం సేకరణ అమలుపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలిపారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 7 .70 శాతం పెరిగిందని ఆయన గుర్తుచేశారు. అటవీ విస్తీర్ణం 10 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున గ్రీనరీ పెంపొందించేందుకై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 19,400 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుచేశామని, ఇప్పటి వరకు ఏర్పాటుచేయని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దీనితో పాటు ప్రతి మండలంలో కనీసం నాలుగు బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలన్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌చ్చ‌ద‌నం పెంపు కోసం ప్ర‌తీ మున్సిపాలిటీకి ప్ర‌ణాళిక ఉండాల‌ని చెప్పారు. ఖాళీ స్థ‌లాల‌ను గుర్తించి, చిక్క‌టి ప‌చ్చ‌దనం పెంచ‌టం ల‌క్ష్యంగా పెట్టుకోవాల‌న్నారు. ఎండ‌లు తీవ్రంగా ఉన్నందున హ‌రిత‌హారం మొక్క‌ల‌కు వారంలో రెండు, మూడు సార్లు నీటి వ‌స‌తి క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఇరిగేష‌న్ ప్రాజెక్టుల వద్ద, కాలువ గ‌ట్లపై ప‌చ్చ‌ద‌నం పెంపు, ప‌ది శాతం క‌న్నా త‌క్కువ అట‌వీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో పచ్చ‌ద‌నం పెంచ‌టం ఎనిమిద‌వ విడ‌త హ‌రిత‌హారం ప్రాధాన్య‌తా అంశాలు అని ఆయన ప్ర‌క‌టించారు. అన్ని సాగునీటి ప్రాజెక్టులు, కాలువ గ‌ట్ల వెంట ప‌చ్చ‌ద‌నం పెంచ‌టం అత్యంత ప్రాధాన్య‌తా అంశ‌మ‌ని, ఇందు కోసం వారం రోజుల్లో యాక్ష‌న్ ప్లాన్ ను సిద్దం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దళిత బంధు అమలును సి.ఎస్ సోమేశ్ కుమార్ సమీక్షిస్తూ‌, ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే మంజూరు చేసి లబ్దిదారులను గుర్తించిన దళితబంధు యూనిట్లను వెంటనే గ్రౌండ్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వరి ధాన్యం సేకరణ గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే ఏడు కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 4.5 కోట్లు త్వరలో వస్తాయని ఆయన అన్నారు. అన్ని రైతు వేదికల్లో రైతు సమావేశాలు నిర్వహించి, సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, రైతు వేదికలను క్రియాత్మకంగా తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post