TSIC 2021 చాలెంజ్ పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్


విద్యార్థుల్లోని శాస్త్రీయ నైపుణ్యాలను వెలికితీయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి అక్టోబర్ 27:-
విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసి వారిని ప్రోత్సహించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్,ఇంక్వి-ల్యాబ్ ఫౌండేషన్,యూనిసెఫ్ సంయుక్త సహకారంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో నిర్వహిస్తున్న తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ (టి.ఎస్.ఐ.సి-2021) గోడపత్రిక,కరదీపికలను బుధవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే దిశగా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. గత సంవత్సరం ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన100% పాఠశాలలు నమోదు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని తమ సృజనాత్మకమైన ఆలోచనలకు పదును పెట్టారని కితాబునిచ్చారు. డాక్టర్ ఎం.సి.ఆర్ హెచ్.ఆర్.డిలో ఈ ఏడాది జనవరి 4వ తేదీన నిర్వహించిన గ్రాండ్ ఫినాలె ప్రదర్శనలో కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాగినేడు విద్యార్థులు పాల్గొనడం హర్షదాయకమన్నారు.ఈ సారి సంక్షేమశాఖల రెసిడెన్షియల్ పాఠశాలలకు తోడుగా ప్రైవేట్ యాజమాన్యాల ఉన్నత పాఠశాలలకు అవకాశం కల్పించినందున అన్ని యాజమాన్యాల పాఠశాలలు పెద్దఎత్తున ఇందులో పాల్గొని సకాలంలో ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని వివరించారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె.శంకర్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి డి.మాధవి,జిల్లా సైన్స్ అధికారి బి.రవినందన్ రావులు పాల్గొన్నారు.

Share This Post