VKB-జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశము.. వికారాబాద్ జిల్లా :

పత్రిక ప్రకటన, తేది: 24.08.2021

వికారాబాద్ జిల్లా:- కరోనా కారణంగా గతంలో జనరల్‌బాడీ సర్వ సభ్య సమావేశం నిర్వహించుకోలేక పోయామని, జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించడానికి ఈ సమావేశాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి కోరారు. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ వస్తోందని వార్తలు వస్తున్నాయ్‌.. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యం చేయాలని, వాక్సినేషన్‌ వందశాతం పూర్తి అయ్యేల చూడాలని సూచించారు. గతేడాది జిల్లా పరిషత్‌ నుంచి కరోనా నివారణకు జిల్లాలో అనేక చర్యలుతీసుకున్నాం. మనం తీసుకున్న చర్యలపట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. ఇక ముందు కూడా ఎలాంటి ఆపత్కర పరిస్థితులువచ్చిన జడ్పీ నుంచి బాధ్యతగా వ్యవహరిస్తాం. జిల్లాలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు . రైతులు పొలాలకు వెళ్ళడానికి రోడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే జడ్పీ నిధులతో పానాది రోడ్లు వేయిస్తున్నామని, దాని వలన రైతుల పంటను ఇంటికి తీసుకురావడానికి వీలు పడుతుందని తెలిపారు. ముఖ్యంగా రైతుల భూములకు మార్కెట్‌లో విలువపెరిగింది. రోడ్లు వేసిన దగ్గర రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతులందరికి రైతుబంధు అందేలా చూడాలని అధికారులను కోరారు. చాలా మంది రైతులకు ఇంకా పట్టా పాసుపుస్తకాలు పెండింగ్లో ఉన్నట్లు తెలస్తోంది, జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని అందరికీ పట్టా పుస్తకాలు అందేలా చూడాలన్నారు. అలాగే జిల్లాలో పంచాయతీ రాజ్, ఆర్‌ అండ్‌ బీ రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయని, నిధులు మంజూరు అయిన బ్రిడ్జీలు, రోడ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వారు సేవలు అందించినందుకు వారిని అభినందించారు. తాండూరు జిల్లా ఆస్పత్రికి జడ్పీ నుంచి సుమారు 60 లక్షల నిధులు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ మధ్య డెంగ్యూ జ్వరాలు భాగా ప్రబలుతున్నాయి. పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో గ్రామాల్లో పారుశుద్ధ్యం మెరుగు పరచాలి. అలాగే ఆర్‌డబ్ల్యూస్‌ అధికారులు మీషన్‌ భగీరథ నీళ్లు ప్రతీ ఇంటికి చేరేలా చూడాలి. కొన్ని గ్రామాల్లో నేటికి భగీరథ నీటిని తాగకుండా బట్టలు ఉతకడానికి వాడుకుంటున్నారని తెలుస్తుంది. అధికారులు మిషన్ భగీరథ వాటర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జడ్పీ నుంచి ఇప్పటికే మంజూరైన పనులను పూర్తి చేయాలని సూచించారు.. పాఠశాలల మరమ్మత్తులకు, కొత్త క్లాసు రూమ్‌లకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, అట్టి పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అంగన్‌వాడీ భవనాలు పూర్తి కొసం అవసరమైన నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. నాణ్యతలో రాజీ పడే ప్రసక్తి లేదని ఇంజనీర్ల పర్యవేక్షణలోనే పనులు జరగాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలోని నిధులను సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకం కింద చేపట్టిన స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు ప్రతీ గ్రామంలో పూర్తి చేయాలి. నాటిన మొక్కలకు నీళ్లు పోస్తు సంరక్షించాలి. గ్రామాల్లో పారుశుద్ధ్యంపై ఎప్పటికప్పుడు డీపీఓ పర్యవేక్షించాలి. గ్రామాలను పరిశుభ్రంగా ఉండాలి. విద్యుత్‌ ప్రమాదాలు జరుగకుండా విద్యుత్‌ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్‌ల ద్వారా మంజూరైన రుణాలను గ్రౌండింగ్‌ చేయాలని సూచించారు . చాలా వరకు బ్యాంకుల్లో నేటికి పెండింగ్‌లో ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని, వారికి రుణాలు అందించి స్వయం ఉపాధి పొందేల చూడాలన్నారు. పేదలకు సకాలంలో రేషన్‌ సరుకులు అందేలా చూడాలన్నారు. అటవీ శాఖ అధికారులు నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. అడవుల్లో వన్యప్రాణులకు పండ్ల చెట్లు నాటాలి. అనంతగిరి అడవుల్లో వందల రకాల పక్షులు ఉన్నాయి. వాటిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉంది. మన జిల్లాలో కూరగాయల సాగుకు అనుకూలంగా ఉన్న గ్రామాలను గుర్తించి రైతులకు ఉద్యానవన శాఖ అధికారులు ప్రోత్సాహం కల్పించాలని కోరారు . రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ పేదవారికి అందేల అధికారులు చూడాలన్నారు. అర్హులైన వృద్ధులు, విగలాంగులు ఫింఛన్ల కోసం కార్యాలయాల చుట్టు తిరగకుండా కొత్త పింఛన్ల మంజూరుకు మీసేవా కేంద్రాల్లో ఉచితంగా ధరఖాస్తు చేసుకోనేలా చూడాలని సభ్యులను కోరారు. ఇక జిల్లా అభివృద్ధిలో జడ్పీ కీలక భూమిక పోషిస్తుందని జడ్పీ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, పొలాలకు పానాదులు, నీటి సమస్య ఉన్న దగ్గర బోర్లు వేయించడం, డ్వాక్రా, అంగన్‌వాడీ భవనాలు నిర్మించడం వంటి పనులు జరుగుతుందన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జడ్పీ చైర్మన్ ఈ సందర్బంగా ఆకాంక్షించారు. హరితహారంలో భాగంగా గ్రామాలలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా గ్రామాలలో మంచి వాతావరణం కొసం నర్సరీలలో ఇంకా మిగిలివున్న మొక్కలను కూడా నాటాలని సూచించారు. గ్రామ పంచాయతీలలో ఆదాయం పెంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, జిల్లా అదనపు కలెక్టర్ (LB ) చంద్రయ్య, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, పరిగి, చేవెళ్ల శాసన సభ్యులు మహేష్ రెడ్డి, కాలే యాదయ్య, జడ్పీ వైస్ చైర్మన్ విజయికుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కో -ఆప్షన్ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————DPRO / Vikarabad.

Share This Post