VKB-భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలి.. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్.

పత్రిక ప్రకటన, తేది: 30-08-2021

వికారాబాద్ జిల్లా :- రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున రెవిన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, జరుగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు.
గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం రాష్ట్ర డిజిపి శ్రీ మహేందర్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా సీ.ఎస్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, డ్యాములు నిండాయని, అదేవిధంగా గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వలన ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, మంగళ వారం 31 న కృష్ణాష్టమి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నా కూడా అధికారులందరూ తమ హెడ్క్వార్టర్స్ లోనే ఉండి పరిస్థితులను పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాల వలన ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉండాలని, ఎలాంటి నష్టం జరగకుండ అధికారులు సమన్వయంతో టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని తెలిపారు. ప్రమాద ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కఠినంగా నిరోధించాలని తెలిపారు. అవసరమైనచోట ట్రాఫిక్ మళ్లించాలని సూచించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పౌసుమి బసు మాట్లాడుతూ జిల్లాలోని మార్పల్లి, నవాబుపేట మండలాల్లో దురదృష్టవశత్తు రెండు ఘటనలలో, ముగ్గురు మృతి చెందారని, ఇలాంటి సంఘటనలు జరుగకుండ పూర్తి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వర్షాల పడుతున్న కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ట్రాఫిక్ ని మలించి ఆ మార్గం నుండి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు విధించడమైనదని తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు R&B, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రెవిన్యూ, విద్యుత్ శాఖల అధికారులు అందరు అప్రమత్తంగా ఉన్నారని CS కు కలెక్టర్ తెలియజేసినారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా SP నారాయణ, జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, DM&HO సుధాకర్ షిండే, R&B EE లాల్ సింగ్, PR ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.
—————————————-DPRO/VKB

Share This Post